నా భూముల్లో ఇంచు కూడా ఇనాం లేదు : బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీశ్రెడ్డి

నా భూముల్లో ఇంచు కూడా ఇనాం లేదు : బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీశ్రెడ్డి

హైదరాబాద్, వెలుగు: దారి తప్పిన వాస్కోడిగామా, కొలంబస్​లా సీఎం రేవంత్​ రెడ్డి మారిపోయారని, 22ఏ అంశంపై అడ్డంగా దొరికారని బీఆర్ఎస్​ ఎమ్మెల్యే జగదీశ్​ రెడ్డి అన్నారు. తన భూముల్లో ఒక్క ఇంచు కూడా ఇనాం భూమి లేదన్నారు. బుధవారం ఆయన తెలంగాణభవన్​లో మీడియాతో మాట్లాడారు. 2018, 2023 ఎన్నికల అఫిడవిట్​లో అన్ని వివరాలు స్పష్టంగా ఉన్నాయని చెప్పారు. కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావు, బీఆర్ఎస్ నేతలపై సీఎం రేవంత్​ రెడ్డి చేసిన ఆరోపణలన్నీ పూర్తిగా అబద్ధాలన్నారు.

కాంగ్రెస్​ వాళ్లలాగా తాము వేరే వాళ్ల భూములు తీసుకోలేదన్నారు. కేసీఆర్ 2008 నుంచే అక్కడ భూమిని కొన్నారన్నారు. కేసీఆర్ వద్ద వెయ్యి ఎకరాలు ఉందని గతంలో చెప్పింది అవాస్తవం అని రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ఒప్పుకున్నారన్నారు. అసెంబ్లీ సాక్షిగా అబద్ధాలు చెప్పి సీఎం పదవి స్థాయిని రేవంత్​ దిగజార్చారని ఎమ్మెల్యే వేముల ప్రశాంత్​ రెడ్డి విమర్శించారు.

కేసీఆర్​కు ఉన్నది 67 ఎకరాలు అని చెప్పిన సీఎం.. ఆ వెంటనే 300 ఎకరాలకు పైగా ప్రభుత్వ భూమి అంటున్నారని ఆరోపించారు. సిరిసిల్లలో తోట ఆగయ్యకు మాజీ నక్సలైట్ల పునరవాసం కింద 2002లో ప్రభుత్వం ఇచ్చిన భూమిని ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్కార్ లాక్కున్నదన్నారు.